ముంబై, అక్టోబర్ 26, 2026, AYUSH24 NEWS ప్రతినిధి: తెలంగాణకు అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ముంబైలోని సహ్యాద్రి ప్రభుత్వ అతిథి గృహంలో సమావేశమైంది. ఈ భేటీలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రాణహిత నదిపై నిర్మించనున్న తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపు, నీటి లభ్యత, ముంపు ప్రభావం, పరిహారం, ఇతర సాంకేతిక అంశాలపై సమగ్రంగా చర్చించారు. సమావేశం ప్రారంభంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు ప్రాధాన్యతను వివరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, గిరిజనులు, ఆదివాసీల జీవన పరిస్థితులు, ఆర్థిక వెనుకబాటుతనాన్ని మహారాష్ట్ర ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. అభివృద్ధి అవకాశాలు అందకపోవడం, ఆర్థిక వెనుకబాటుతనం కారణంగా గతంలో నక్సలిజం వంటి సమస్యలు తలెత్తిన పరిస్థితులను వివరించారు. ఈ ప్రాంతానికి సాగునీరు అందించేందుకు 1975 అక్టోబర్ 6న అప్పటి ముఖ్యమంత్రులు జలగం వెంగళరావు, ఎస్.బీ. చవాన్ మధ్య కుదిరిన ఒప్పందం నుంచి ఐదు దశాబ్దాలుగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఆశించిన పురోగతి సాధించలేకపోయామని తెలిపారు. 2016లో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 148 మీటర్లుగా నిర్ణయిస్తూ ఒప్పందం కుదిరిందని గుర్తుచేశారు. అయితే ఆ ఎత్తుతో నిర్మాణం చేపడితే తెలంగాణ తాగు, సాగునీటి అవసరాలు పూర్తిస్థాయిలో తీరవని వివరించారు. విద్యుత్ అవసరాలు, ఇంధన వ్యయం, పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులు, ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే గ్రావిటీ ద్వారా నీటిని తరలించే విధానానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించడం సాంకేతికంగా, ఆర్థికంగా, నిర్వహణపరంగా ప్రయోజనకరమైన ప్రత్యామ్నాయమని ప్రతిపాదించారు. బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే వ్యవసాయ భూములకు ఆ రాష్ట్ర భూసేకరణ నిబంధనలు, పరిహార విధానం ప్రకారం నష్టపరిహారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ, మహారాష్ట్ర మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను గుర్తుచేశారు. పూర్వ హైదరాబాద్ సంస్థానంతో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాలకు ఉన్న అనుబంధాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధానంగా వెనుకబడిన అటవీ ప్రాంతమని, అక్కడి గిరిజనులు, ఆదివాసీలు దశాబ్దాలుగా సాగు, తాగునీటి సదుపాయాల కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. కొమురం భీమ్ సాగించిన జల్, జంగిల్, జమీన్ పోరాటాన్ని గుర్తుచేస్తూ ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రెండు రాష్ట్రాలు కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు. దేశ రక్షణ, జాతీయ వ్యూహాత్మక ప్రయోజనాల పరంగా ఆదిలాబాద్ ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌లో ప్రతిపాదిత రక్షణ, పౌర విమానాశ్రయ సదుపాయం అందుబాటులోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో రవాణా, ఆర్థిక కార్యకలాపాలు, అభివృద్ధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాకుండా రెండు రాష్ట్రాలను భౌతికంగా అనుసంధానించే వారధిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. గిరిజనుల సంక్షేమం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. తెలంగాణ ప్రతిపాదనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతంతో ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. తన అమ్మమ్మ తెలుగు మాట్లాడతారని ఈ సందర్భంగా ప్రస్తావించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును పెంచాలన్న తెలంగాణ అభ్యర్థనను మరోసారి పరిశీలించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే తుది నిర్ణయానికి ముందు సాంకేతిక, పర్యావరణ, పరిపాలనాపరమైన అంశాలపై సమగ్ర అధ్యయనం అవసరమని స్పష్టం చేశారు. మహారాష్ట్రకు, ఆ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని తేలితే 148 మీటర్ల ఎత్తుకు సంబంధించిన గత ఒప్పందాన్ని పునఃపరిశీలించేందుకు అభ్యంతరం లేదన్నారు. తెలంగాణ నీటి అవసరాలకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతామని తెలిపారు. గతంలో ఇతర రాష్ట్రాలతో ఉన్న పలు అంతర్రాష్ట్ర సమస్యలను పరస్పర చర్చలు, సహకారంతో పరిష్కరించుకున్నామని గుర్తుచేశారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం (CWC) తన పరిధిలో అవసరమైన సాంకేతిక అధ్యయనాలు చేపడుతుందని తెలిపారు. ఈలోపు రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శుల నేతృత్వంలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. బ్యారేజీ ఎత్తు, నీటి లభ్యత, మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే భూముల విస్తీర్ణం, ప్రభావిత ప్రాంతాలు, పరిహారం, ఇతర సాంకేతిక అంశాలను కమిటీ సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. ముంపు ప్రభావంపై రెండు రాష్ట్రాల అంచనాలను అధ్యయనం చేసి, ఇరు రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, అవసరమైతే ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించాలని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల అధికారులు, సాంకేతిక నిపుణులు సంప్రదింపులు కొనసాగించి, తదుపరి సమావేశాల నిర్వహణ, కాలపరిమితులు, ప్రాజెక్టు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. దేశంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఇరువురు ముఖ్యమంత్రులు పునరుద్ఘాటించారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, గిరిజనులు, ఆదివాసీలు, అభివృద్ధి అవకాశాలు అందని వర్గాల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి ప్రాధాన్యం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై మహారాష్ట్ర ప్రభుత్వం అధ్యయనానికి సానుకూలంగా స్పందించడంతో ప్రాజెక్టుకు సంబంధించిన తదుపరి చర్చలు, సాంకేతిక పరిశీలనలకు మార్గం ఏర్పడింది. అయితే బ్యారేజీని 152 మీటర్ల ఎత్తుతో నిర్మించే ప్రతిపాదనపై తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది.
తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపుపై తెలంగాణ–మహారాష్ట్ర ముఖ్యమంత్రుల కీలక భేటీ.. 152 మీటర్ల ప్రతిపాదనపై అధ్యయనానికి సానుకూల స్పందన
26అక్టోబర్2026
06:59 సాయంత్రం PM
🇮🇳 జాతీయ స్థాయి రిపోర్టర్ నియామకంమీ ప్రాంతం నుంచి AYUSH24 NEWS కోసం వార్తలను అందించండి.

AYUSH24 NEWS Reporter Network
మీ ప్రాంతం నుంచి వార్తలు అందించాలనుకుంటున్నారా? మా Reporter Networkలో చేరండి.
Become a Reporter →







Leave a Reply