విద్యతో పాటు అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి: ఎంపీడీవో శ్రీజ రెడ్డి, ఎంఈఓ లక్ష్మి
మంథని, సెప్టెంబర్ 30, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
మంథని మండలం భవిత కేంద్రంలో దివ్యాంగ విద్యార్థులకు మండల స్థాయి ఆటల పోటీలను బుధవారం నిర్వహించారు. మండల పరిధిలోని వివిధ పాఠశాలలకు చెందిన దివ్యాంగ విద్యార్థులు పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తితో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో శ్రీజ రెడ్డి, ఎంఈఓ లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులను విద్యతో పాటు క్రీడలు, సాంస్కృతిక, సామాజిక తదితర అన్ని రంగాల్లో ప్రోత్సహించాలని అన్నారు. ఇతర విద్యార్థులతో సమానంగా దివ్యాంగ విద్యార్థులకు కూడా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
దివ్యాంగ విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే మరింత ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని తెలిపారు. వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి క్రీడా పోటీలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఆటల ద్వారా ఆత్మవిశ్వాసం, పట్టుదల, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తి పెంపొందుతాయని తెలిపారు. సమాజంలో దివ్యాంగుల పట్ల సానుకూల దృక్పథాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు.

అనంతరం వివిధ క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించి, ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో దివ్యాంగ విద్యార్థులు, విలీన విద్యా ఉపాధ్యాయులు శ్రీనివాస్, సురేష్, సౌజన్యతో పాటు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.










Leave a Reply