ఏటా రూ.2,500 కోట్ల అదనపు భారం — కరవు పరిస్థితులు, ధాన్యం కొనుగోలు, విద్యుత్ డిమాండ్‌పై మంత్రివర్గంలో విస్తృత చర్చ
హైదరాబాద్, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏల్లో రెండు డీఏలను వెంటనే మంజూరు చేయాలని నిర్ణయించారు. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బకాయిలను విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించారు.
ఉద్యోగ సంఘాలతో ఇటీవల జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక భారం ఉన్నప్పటికీ రెండు డీఏల మంజూరుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లు మంత్రులు వెల్లడించారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.2,500 కోట్ల అదనపు భారం పడనున్నట్లు తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ఎల్‌నినో కారణంగా ఏర్పడిన పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుత వర్షాకాలంలో సుమారు 17 శాతం వర్షపాతం లోటు నమోదైందని, దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు.
కరవు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన తక్షణ చర్యలపై కేబినెట్ సబ్‌కమిటీలో సమగ్రంగా చర్చించాలని నిర్ణయించారు. ఈ అంశంపై త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతు సంఘాలు, వివిధ రంగాల నిపుణులతోనూ సమావేశాలు నిర్వహించి సూచనలు, సలహాలు స్వీకరించాలని నిర్ణయించారు.
కరవు ప్రభావిత మండలాలను ప్రకటించి రాష్ట్రానికి తగిన సహాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర మంత్రివర్గం కోరింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రానికి వివరించేందుకు మంత్రుల బృందం త్వరలో ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయించింది.
ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని, త్వరలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ సీజన్లో సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేసినట్లు తెలిపారు.
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినట్లు మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. సాధారణంగా రోజువారీ విద్యుత్ డిమాండ్ 15 వేల మెగావాట్ల స్థాయిలో ఉండగా, ఈ సీజన్లో గరిష్ఠ డిమాండ్ 19,892 మెగావాట్లకు చేరిందని తెలిపారు. గతేడాది గరిష్ఠంగా 16,613 మెగావాట్లు నమోదైనట్లు పేర్కొన్నారు.
విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి, సరఫరాపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా అవసరమైన మేరకు విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
భవిష్యత్ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సుమారు 7,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో కొత్త పునరుత్పాదక ఇంధన యూనిట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 3,000 మెగావాట్ల సోలార్ పవర్, 4,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, 800 మెగావాట్ల విండ్ పవర్ యూనిట్ల ప్రతిపాదనలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం బిడ్డింగ్ విధానంలో ఈ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహిర్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ మార్కెట్‌ను పూర్తిగా ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేయాలని సూచించారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను సమీక్షించిన కేబినెట్, గత ఆదేశాల ప్రకారం పూర్తి కాని EPC విధానంలోని ప్రాజెక్టులను రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా 10 EPC సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేసేందుకు ఆమోదం తెలిపింది.
తెలంగాణలో డిజిటల్ మీడియా ప్రకటనల కోసం ప్రత్యేక విధానం అమలు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ రూపొందించిన డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ పాలసీకి అనుగుణంగా రాష్ట్రంలో ఈ విధానాన్ని రూపొందించినట్లు వెల్లడించారు.
న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పనిచేసేందుకు డిప్యూటీ కమిషనర్ పోస్టుతో పాటు నలుగురు గ్రూప్-1 అధికారులను నియమించే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాకు వెల్లడించారు.










Leave a Reply