ఏజెన్సీల దోపిడీని అరికట్టి ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు కల్పించాలని డిమాండ్
AYUSH24 News ప్రతినిధి
హైదరాబాద్: సెప్టెంబర్ 29
తెలంగాణలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఔట్సోర్సింగ్ ఉద్యోగుల స్టేట్ జేఏసీ చైర్మన్, అధ్యక్షుడు పులి లక్ష్మయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఆయన AYUSH24 Newsతో తన అభిప్రాయాలను పంచుకున్నారు.
రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలు అంధకారంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఏజెన్సీల దోపిడీని అరికట్టడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనాలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగుల జీవితాల్లో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులు అభద్రతాభావంతో జీవించాల్సిన పరిస్థితి మారాలని, వారికి గౌరవప్రదమైన జీవనం కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
“ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నిండాలి. బానిసత్వ భావన నుంచి బయటపడి తలెత్తుకుని జీవించే పరిస్థితి రావాలి. మా సమస్యల పరిష్కారం కోసం ఎంత దూరమైనా వెళ్తాం. ఉద్యమాన్ని మాత్రం ఆపేది లేదు” అని పులి లక్ష్మయ్య స్పష్టం చేశారు.
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిశీలించి, ఏజెన్సీల వ్యవస్థలో జరుగుతున్నట్లు చెబుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగ భద్రత, కనీస వేతనాల అమలుపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply