గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి
జైపూర్, భీమారం, చెన్నూరు మండలాల్లో పర్యటన
మంచిర్యాల, సెప్టెంబర్ 24 (ప్రతినిధి):
మంచిర్యాల జిల్లాలోని జైపూర్, భీమారం, చెన్నూరు మండలాల్లో రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులు–భూగర్భశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చెన్నూరు పట్టణంలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన నిమజ్జన శోభాయాత్రలో మంత్రి పాల్గొన్నారు. నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథులను సాగనంపేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
పట్టణంలోని వినాయక మండపాల వద్ద మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద చెరువు వద్ద జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాన వీధుల్లో భక్తుల జయజయధ్వానాలు, ‘గణపతి బప్పా మోరియా’ నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయని తెలిపారు. నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
చెన్నూరు నియోజకవర్గాన్ని రోల్ మోడల్‌గా తీర్చిదిద్దాలన్నది తన లక్ష్యమని మంత్రి తెలిపారు. గోదావరి పుష్కరాలకు సంబంధించిన అభివృద్ధి పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు చెప్పారు.
చెన్నూరు పెద్ద చెరువులోని శివాలయ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి రూ.17 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయించినట్లు మంత్రి వెల్లడించారు. పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
రోడ్డు విస్తరణ కారణంగా ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు పట్టణంలో షాపులు నిర్మించి కేటాయిస్తామని చెప్పారు. గతంలో రోడ్డు విస్తరణలో షాపులు కోల్పోయి ప్రత్యామ్నాయ షాపులు పొందని వారికి కూడా షాపులు నిర్మించి ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు.










Leave a Reply