మంథని నుంచి జేఎన్టీయూహెచ్ కళాశాలకు ప్రత్యేక బస్సులు నడపాలి
మంత్రి శ్రీధర్ బాబు, ఆర్టీసీ అధికారులకు విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది వినతి
మంథని ప్రతినిధి | ఆగస్టు 1 | AYUSH 24 NEWS
రామగిరి మండలం పన్నూరు గ్రామంలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జేఎన్టీయూహెచ్) యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, మంథని కళాశాలకు మంథని బస్టాండ్ నుంచి నేరుగా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కళాశాల సిబ్బంది రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఆర్టీసీ అధికారులను కోరారు.
ఈ మేరకు మంథనిలో మంత్రిని, బస్సు డిపో మేనేజర్‌ను కలిసి వినతిపత్రం అందజేయగా, కరీంనగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్, డిప్యూటీ రీజినల్ మేనేజర్లకు వాట్సాప్ ద్వారా కూడా వినతిపత్రాన్ని పంపించారు.
విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది మాట్లాడుతూ ప్రస్తుతం మంథని, పరిసర ప్రాంతాల నుంచి సుమారు 20 మంది విద్యార్థులు, 25 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు మరియు ఇతర సిబ్బంది ప్రతిరోజూ ఆర్టీసీ బస్సుల్లో పన్నూరు ఎక్స్ రోడ్ వరకు ప్రయాణించి, అక్కడి నుంచి దాదాపు కిలోమీటరున్నర దూరం నడిచి కళాశాలకు చేరుకోవాల్సి వస్తోందని తెలిపారు.
ఎండ, వర్షం, చలి కాలాల్లో ఈ ప్రయాణం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, ముఖ్యంగా మహిళా సిబ్బంది, విద్యార్థినులు సమయానికి కళాశాలకు చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి. విష్ణువర్ధన్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి మంత్రి శ్రీధర్ బాబు, కరీంనగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్, మంథని డిపో మేనేజర్లకు వినతిపత్రాలు పంపించారు. మంథని–పెద్దపల్లి మార్గంలో జేఎన్టీయూ కళాశాల మీదుగా బస్సు సర్వీసులను ప్రారంభించాలని ఆయన కోరారు.
ప్రస్తుతం సరైన బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, సిబ్బంది రోజువారీ ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పన్నూరు ఎక్స్ రోడ్ వద్ద దిగి కళాశాల వరకు నడవడం ప్రమాదకరంగా మారిందని ప్రిన్సిపల్ తన లేఖలో పేర్కొన్నారు.
కళాశాల ప్రారంభ సమయానికి ఉదయం, ముగింపు సమయానికి సాయంత్రం మంథని–జేఎన్టీయూ–పెద్దపల్లి మార్గంలో టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను క్రమం తప్పకుండా నడపాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, సిబ్బంది ఆర్టీసీ అధికారులను విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు సింగారపు శివరామకృష్ణ, ఎస్. కుమార్, తల్లిదండ్రులు పెండ్యాల రామ్‌కుమార్, చెన్నోజు రమేష్, ఏరువాక శ్రీనివాస్, విద్యార్థులు పెండ్యాల శ్రీనిధి, చెన్నోజు అఖిల, సిబ్బంది మాడిశెట్టి లక్ష్మీనారాయణ, చల్ల మనోహర్ రెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
📰 AYUSH 24 NEWS
“ప్రజల గొంతుక – నిజాల వెలుగులో వార్తలు”

