రంగురంగుల విద్యుత్ అలంకరణలు, యువత నృత్యాలు, మహిళల కోలాటాలతో ఆకట్టుకున్న శోభాయాత్ర
దేవరకొండ: సెప్టెంబర్ 28 (AYUSH24 News ప్రతినిధి)
దేవరకొండ పట్టణంలోని శివాజీ నగర్లో ఏర్పాటు చేసిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధలతో, సందడిగా సాగింది. యువత, మహిళలు, చిన్నారుల కేరింతల మధ్య ప్రత్యేకంగా అలంకరించిన గణనాథుడి శోభాయాత్ర ఆకట్టుకుంది.
రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తుండగా కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యువత పాటలకు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ, బాణాసంచా కాలుస్తూ సందడి చేయగా, మహిళలు కోలాటాలు, భజనలతో శోభాయాత్రలో పాల్గొన్నారు. చిన్నారులు సైతం ఉత్సాహంగా పాల్గొనడంతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.
సాయంత్రం ప్రారంభమైన శోభాయాత్ర రాత్రి వరకు కొనసాగింది. వినాయకుడి వద్ద భక్తులు ఆడి పాడుతూ గణనాథుడికి ఘనంగా వీడ్కోలు పలికారు.
ప్రత్యేక ఆకర్షణగా నిలువెత్తు వినాయకుడు
పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వినాయక నిమజ్జనాలు పూర్తికాగా, ఆదివారం నిర్వహించిన శివాజీ నగర్ వినాయకుడి నిమజ్జనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పట్టణంలోని వివిధ వార్డుల నుంచి భక్తులు, ప్రజలు తరలివచ్చారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిలువెత్తు వినాయకుడి ముందు చిన్నాపెద్దా తేడా లేకుండా భక్తులు చప్పట్లు కొడుతూ, నృత్యాలు చేస్తూ సందడి చేశారు. నిర్వాహకులు కూడా నృత్యాలతో గణనాథుడిని సాగనంపారు.
శివాజీ నగర్లో గత కొన్ని సంవత్సరాలుగా వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి నవరాత్రుల సందర్భంగా పూజలు నిర్వహిస్తూ, నిమజ్జన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ ఏడాది నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు వందలాది మంది తరలివచ్చి పాల్గొన్నారు.










Leave a Reply