కేరళ వెలుపలి నుంచి ఈ పురస్కారానికి ఎంపికైన తొలి వ్యక్తిగా సీఎం రేవంత్ రెడ్డి
నిలంబూర్, సెప్టెంబర్ 25 (AYUSH24 News ప్రతినిధి): తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మక **‘ఆర్యదాన్ ముహమ్మద్-2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు’**ను స్వీకరించారు. కేరళ రాష్ట్రంలోని నిలంబూర్‌లో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్యదాన్ ముహమ్మద్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. తనను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కేరళ వెలుపలి నుంచి ఈ అవార్డుకు ఎంపికైన తొలి వ్యక్తిగా నిలవడం మరింత గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేరళతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న రేవంత్ రెడ్డి, తాను కేరళకు వచ్చిన ప్రతిసారీ ఆత్మీయ స్వాగతం లభించిందన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో జరిగిన భారత్ జోడో యాత్ర సందర్భంగా, అలాగే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేరళకు వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. కేరళ ప్రజలు లౌకికవాదానికి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.
ఆర్యదాన్ ముహమ్మద్ ప్రజా జీవితాన్ని గుర్తుచేస్తూ, ఆయన ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు సేవలందించారని, నాలుగు ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారని సీఎం తెలిపారు.
ఆర్యదాన్ ముహమ్మద్ తన జీవితకాలంలో స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ విలువలకు ప్రాధాన్యం ఇచ్చారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తితో రాజ్యాంగ విలువల పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్యదాన్ ముహమ్మద్ ఫౌండేషన్ ప్రతినిధులు, కేరళ మంత్రులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఆయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply