హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన యోధులకు ఘనంగా నివాళులర్పించారు. అన్యాయాన్ని ఎదిరించడం తెలంగాణ గడ్డ స్వభావమని, పోరాట యోధులకు తెలంగాణ పుట్టినిల్లుగా నిలిచిందని సీఎం పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో గురువారం ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన వారికి నివాళులర్పించారు.
తెలంగాణ నేల ఎప్పటికప్పుడు ప్రజా చైతన్యాన్ని రగిలించిందని సీఎం అన్నారు. సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17కు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు.
నిజాం పాలనలో హైదరాబాద్ ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించిందని గుర్తుచేసిన సీఎం.. అదే సమయంలో దోపిడీ, వెట్టిచాకిరీ, అణచివేతలు పెరిగాయని తెలిపారు. చివరి దశలో రజాకారుల దౌర్జన్యాలు మితిమీరాయని అన్నారు. 1948 సెప్టెంబర్ 17న సైనిక చర్య అనంతరం హైదరాబాద్ భారతదేశంలో విలీనమైందని సీఎం వెల్లడించారు.
సెప్టెంబర్ 17ను ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజా పాలన అంటే ప్రజల హక్కులను కాపాడటమని, ప్రజల ఆత్మగౌరవానికి పట్టం కడుతూ పాలన సాగిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని సీఎం తెలిపారు. రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ చేశామని, దీని ద్వారా 25.35 లక్షల మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరిందని చెప్పారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం 32 నెలల్లో రూ.1.72 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
53 లక్షలకు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని సీఎం అన్నారు. 43 లక్షల కుటుంబాలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని తెలిపారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం పంపినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
— ఆయుష్ 24 న్యూస్ ప్రతినిధి










Leave a Reply