గాజుల రామారంలో 480 ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ఎంత వ్యయమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధమని వెల్లడి
గాజుల రామారం, అక్టోబర్ 06, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ద్వారా పేదల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమలు, రంగారెడ్డి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. మంగళవారం రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి గాజుల రామారంలో 480 ఇళ్లతో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్‌కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపల కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో భూముల ధరలు భారీగా పెరిగినప్పటికీ, పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఎంత వ్యయమైనా భరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్ణయించారని శ్రీధర్ బాబు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత వాటి విలువ రూ.50 లక్షలకు పైగా ఉంటుందని, తద్వారా పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
కొత్తగా నిర్మించే టవర్స్ సముదాయంలో ఆలయాలు, మసీదులు, చర్చిల వంటి ప్రార్థనా మందిరాల నిర్మాణానికి ప్రత్యేకంగా స్థలం కేటాయించే అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిపారు. సొంత ఇల్లు కలిగి ఉండటం జీవితంలో అత్యంత ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు.
క్యూర్ పరిధిలోని కాలుష్య పరిశ్రమలను వెలుపలికి తరలించి, ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందేలా చర్యలు తీసుకుంటున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, వాటిలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అత్యంత ప్రాధాన్యత ఉందని ఆయన వెల్లడించారు.










Leave a Reply