దేవరకొండ కొత్త బస్టాండ్లో సుమారు 200 మంది ప్రయాణికులకు ఉచిత భోజనం
కుమారుడి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం చేపట్టిన గాజుల రాజేష్, ఉషారాణి దంపతులు
దేవరకొండ, అక్టోబర్ 07, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
కీర్తిశేషులు గాజుల అభినవ్ రాజ్ జ్ఞాపకార్థం దేవరకొండ పట్టణంలోని కొత్త బస్టాండ్ ఆవరణలో బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఇచ్చిన పిలుపు మేరకు పితృపక్ష వారోత్సవాల్లో భాగంగా ఫాస్ట్ రీజియన్ చైర్మన్ గాజుల రాజేష్, జోన్ చైర్మన్ లయన్ గాజుల ఉషారాణి దంపతులు తమ కుమారుడు గాజుల అభినవ్ రాజ్ జ్ఞాపకార్థం ప్రయాణికులకు ఉచితంగా భోజనం అందించారు.
ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ప్రెసిడెంట్ గుద్దేటి జంగయ్య మాట్లాడుతూ, ఇటీవల రాజేష్ దంపతుల కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలిపారు. పితృపక్ష వారోత్సవాల్లో కుమారుడి ఆత్మకు శాంతి చేకూరాలని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు.
కుమారుడి జ్ఞాపకార్థం దంపతులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని జంగయ్య పేర్కొన్నారు. బుధవారంతో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమాన్ని మరో రెండు రోజుల పాటు కొనసాగించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సుమారు 200 మంది ప్రయాణికులకు భోజనం అందించారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు గాజుల అభినవ్ రాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారి చిలుకూరి కాశీనాథ్, జోన్ చైర్మన్ గాజుల ఉషారాణి, గాజుల రాజేష్, తిప్పర్తి రుక్మారెడ్డి, అవిరనేని వెంకటేశ్వరరావు, దినేష్, రాజు, ఎన్ ఎన్ చారితో పాటు ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply