విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యతపై ఆరా
మెనూ ప్రకారమే నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు ఆదేశం
రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్ 24 (ప్రతినిధి):
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్‌ను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో విద్యార్థులకు అందుతున్న వసతులు, భోజన నాణ్యత, పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు.
ముందుగా అధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించిన కలెక్టర్, హాస్టల్లోని విద్యార్థుల సంఖ్య, వారి హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెనూ చార్ట్‌ను పరిశీలించి కిచెన్, గోదాంలో నిల్వ ఉంచిన బియ్యం, పప్పులు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు.
మెనూ ప్రకారం విద్యార్థులకు అందించాల్సిన ఆహార పదార్థాలు సిద్ధంగా ఉన్నాయా లేదా పరిశీలించారు. అనంతరం విద్యార్థుల వసతి గదులను తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. హాస్టల్ ఆవరణతో పాటు వంటగది, వసతి గదుల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థులు హాస్టల్లో కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రణాళికాబద్ధంగా చదువుతూ తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు.










Leave a Reply