ఐలమ్మ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి
మంథని: సెప్టెంబర్ 26 (AYUSH24 News ప్రతినిధి)
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ ధైర్యం, ఆత్మగౌరవం, పోరాట పటిమ తెలంగాణ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని మంథని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మంథనిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
రాష్ట్ర ఐటీ, ఈసీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్న, జిల్లా ఆర్టీఏ మెంబర్ మంథని సురేష్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం, మాజీ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎరుకల ప్రవీణ్, మాజీ ఎంపీపీ కొండ శంకర్ మాట్లాడారు.
చాకలి ఐలమ్మ తన భూమి కోసం మాత్రమే కాకుండా పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడారని పేర్కొన్నారు. సామాజిక అన్యాయం, దోపిడీ, అణచివేతకు వ్యతిరేకంగా ఆమె సాగించిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు.
భూమి, భుక్తి, విముక్తి కోసం నాటి నిరంకుశ పాలనకు ఎదురొడ్డి నిలిచిన ఐలమ్మ అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడారని తెలిపారు. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవాన్ని మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
తెలంగాణ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన చాకలి ఐలమ్మ సేవలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని, ఆమె త్యాగాలను స్మరించుకుంటూ సమానత్వం, సామాజిక న్యాయం సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply