TOMCOM–POGLI మధ్య కీలక అవగాహన ఒప్పందం
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (ప్రతినిధి): జపాన్‌లో తెలంగాణ యువతకు నైపుణ్య ఆధారిత ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) కీలక ముందడుగు వేసింది. జపాన్‌కు చెందిన POGLI Co. Ltdతో TOMCOM శుక్రవారం సచివాలయంలో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.
శక్తి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, శక్తి శాఖ కార్యదర్శి దాసరి హరిచందన సమక్షంలో జరిగిన కార్యక్రమంలో TOMCOM ఎండీ కాంతి వెస్లీ, POGLI Co. Ltd వ్యవస్థాపకులు, CEO డా. కరుణ్ మల్హోత్రా ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందంలో భాగంగా జపాన్‌లోని వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలను గుర్తించడం, సంబంధాలను ఏర్పరచుకోవడం POGLI బాధ్యతగా వ్యవహరించనుంది. అభ్యర్థుల ఎంపిక, రిజిస్ట్రేషన్, ప్రాథమిక స్క్రీనింగ్, డాక్యుమెంటేషన్, జపనీస్ భాషా శిక్షణ, ప్రీ-డిపార్చర్ శిక్షణ వంటి కార్యక్రమాలను TOMCOM చేపట్టనుంది.
జపాన్‌లో ఉద్యోగాలకు అవసరమైన ట్రేడ్ నైపుణ్యాలు, జపనీస్ భాషా ప్రావీణ్యం, అక్కడి పని సంస్కృతి, జీవన విధానంపై అవగాహన కల్పించేలా రెండు సంస్థలు కలిసి శిక్షణ విధానాన్ని రూపొందించనున్నాయి. తొలుత జపాన్‌లోని కన్సాయ్ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారించి, అనంతరం ఇతర ప్రాంతాలకు కార్యక్రమాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు.

తొలి ఏడాదిలో 400 నుంచి 500 మంది తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా రెండు సంస్థలు పనిచేయనున్నాయి. జపాన్‌లో ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న తెలంగాణ యువతకు TOMCOM ఇప్పటికే జపనీస్ భాషలో శిక్షణ అందిస్తున్నట్లు వెల్లడించారు.
విదేశాల్లో తెలంగాణ యువతకు సురక్షితమైన, పారదర్శకమైన, దీర్ఘకాలిక ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. జపాన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యం కలిగిన తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా TOMCOM చర్యలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు.










Leave a Reply