కస్టమ్ మిల్లింగ్ రైస్ బకాయిలపై పౌర సరఫరాల శాఖ హెచ్చరిక
ఏడు రోజుల్లో వివరణ ఇవ్వకపోతే ఆస్తుల జప్తుతో పాటు చట్టపరమైన చర్యలు
హైదరాబాద్, అక్టోబర్ 04, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిలు ఉన్న డిఫాల్టర్ రైస్ మిల్లర్లపై చర్యలకు పౌర సరఫరాల శాఖ సిద్ధమైంది. ప్రభుత్వానికి రావాల్సిన బియ్యాన్ని తక్షణమే అప్పగించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు.
కనీస మద్దతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం తీసుకొని, ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని తిరిగి అప్పగించకుండా బకాయి పడిన మిల్లర్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం బకాయిలను వసూలు చేయడంతో పాటు అవసరమైన సందర్భాల్లో డిఫాల్టర్ మిల్లర్ల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత నోటీసులు అందుకున్న మిల్లర్లు ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
చట్టపరమైన, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా డిఫాల్టర్ మిల్లర్లపై చర్యలు చేపట్టే విధానంపై రాష్ట్రవ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 5 నుంచి హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీ సంస్థలో ఈ శిక్షణ ప్రారంభం కానున్నట్లు పేర్కొన్నారు.
అధికారుల ఆకస్మిక తనిఖీల్లో గోదాముల్లో ఉండాల్సిన ధాన్యం కంటే నిల్వలు తక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే సంబంధిత మిల్లర్లకు వెంటనే షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. నోటీసులు అందుకున్న మిల్లర్లు ఏడు రోజుల గడువులోగా వివరణ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
నిర్దేశించిన గడువులో సరైన వివరణ ఇవ్వని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ఆస్తుల జప్తుతో పాటు ఇతర చట్టపరమైన చర్యలు చేపట్టనున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేశారు.




Leave a Reply