బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన చైర్మన్ చేరుపల్లి బాలరాజు
దేవరకొండ: సెప్టెంబర్ 27 (AYUSH24 News ప్రతినిధి)
తెలంగాణ పద్మశాలి సమాజానికి మార్గనిర్దేశకుడిగా, చేనేత సహకార సంఘాల ఏర్పాటుకు ఆద్యుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీ నిలిచారని దేవరకొండ చేనేత సహకార సంఘం చైర్మన్ చేరుపల్లి బాలరాజు అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని చేనేత సహకార సంఘం భవనం ముందు ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా చేరుపల్లి బాలరాజు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలిన నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. పదవులు, అధికారాల కంటే ప్రజల హక్కులకే ప్రాధాన్యత ఇస్తూ తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తిని పద్మశాలి సమాజం కొనసాగించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు, ఆదర్శాలను ఆచరణలో ముందుకు తీసుకెళ్లేందుకు పద్మశాలి సమాజం కలిసికట్టుగా పనిచేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి, సభ్యులు, పద్మశాలి సంఘం నాయకులు, యువజన సంఘం నాయకులు, మహిళా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply