‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా సత్కరించిన బీజేపీ నాయకులు
మంథని, సెప్టెంబర్ 30, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల రోజులుగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమంలో భాగంగా మంథని పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక కార్యకర్త గట్టు కృష్ణమూర్తిని బీజేపీ నాయకులు, కార్యకర్తలు శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా గట్టు కృష్ణమూర్తి తన సొంత ఖర్చులతో పట్టణంలో విస్తృతంగా మొక్కలు నాటడంతో పాటు ప్రమాదకరంగా మారిన రోడ్డు గుంతలను పూడుస్తూ ప్రజా సంక్షేమానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పాఠశాల విద్యార్థుల్లో పర్యావరణ ఆవశ్యకతపై చైతన్యం కల్పిస్తూ, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తున్న ఆయన సేవలను కొనియాడారు.
సన్మానం అనంతరం గట్టు కృష్ణమూర్తి మాట్లాడుతూ భూమిపై ప్రతి జీవి మనుగడకు ప్రకృతి సహకారం ఎంతో అవసరమన్నారు. మానవ విచక్షణారాహిత్యం వల్ల ప్రకృతి నాశనమైతే అది మానవాళి జీవనానికే ముప్పుగా మారుతుందని తెలిపారు. గ్లోబల్ వార్మింగ్, ‘ఎల్ నినో’ వంటి వాతావరణ మార్పులు, భవిష్యత్తు వైపరీత్యాలను తట్టుకోవాలంటే పర్యావరణాన్ని కాపాడుకోవడం తప్ప మరో మార్గం లేదన్నారు. మంథని ప్రజలందరూ ప్రకృతి పరిరక్షణను ఒక యజ్ఞంలా చేపట్టాలని పిలుపునిచ్చారు.
పట్టణ అధ్యక్షుడు సబ్బని సంతోష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బోగోజు శ్రీనివాస్, సీనియర్ నాయకులు రాపర్తి సంతోష్, నారమల్ల కృష్ణ, బూడిద తిరుపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి సామల అశోక్, పట్టణ ఉపాధ్యక్షులు బొల్లంపల్లి లక్ష్మణ్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు గుడ్ల గురువేష్, పట్టణ కోశాధికారి వొడ్నాల శ్రీనివాస్, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










Leave a Reply