దేవరకొండ, సెప్టెంబర్ 14, ఆయుష్ 24 న్యూస్:
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ దేవరకొండ పట్టణంలోని దొడ్డి అశోక్–సువర్ణ దంపతుల కాంప్లెక్స్‌లో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వినాయక చవితిని పురస్కరించుకుని సోమవారం కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన మట్టి వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన మట్టి వినాయకుడికి భక్తులు అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనం కారణంగా నీటి కాలుష్యం ఏర్పడే అవకాశం ఉందన్నారు. కలుషితమైన నీటివల్ల పక్షులు, పశువులు, మానవులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉన్నందున పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించినట్లు తెలిపారు.
మట్టి వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో మండపానికి తరలివస్తున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు. ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకోనున్న వినాయకుడిని మండపం వద్దే నిమజ్జనం చేసి, అనంతరం లభించే మట్టిని మొక్కలకు వినియోగించనున్నట్లు తెలిపారు.
ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి, పర్యావరణహితమైన వినాయక చవితి వేడుకలను నిర్వహించాలని దొడ్డి అశోక్–సువర్ణ దంపతులు కోరారు.



Musini.Anjan





Leave a Reply