రెండు డీఏల చెల్లింపునకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
హైదరాబాద్, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దసరా కానుకగా 2024 నుంచి పెండింగ్‌లో ఉన్న డీఏల్లో రెండింటిని విడుదల చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రెండు డీఏల బకాయిలను వాయిదాల్లో చెల్లించనున్నట్లు మంత్రులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సాయంత్రం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వివరాలను విలేకరులకు వెల్లడించారు.
ఆర్థికంగా భారమైనప్పటికీ ఉద్యోగ సంఘాలతో చర్చల సందర్భంగా ఇచ్చిన హామీకి కట్టుబడి ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి అంగీకరించినట్లు మంత్రులు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.2,500 కోట్ల భారం పడుతుందని చెప్పారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్న ఉద్యోగులు, వారి కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ డీఏలకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎల్‌నినో పరిస్థితులపైనా మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ఈ వానాకాలంలో 17 శాతం వర్షపాతం లోటు ఉందని పేర్కొన్నారు. బుధవారంతో నైరుతి రుతుపవనాల కాలం ముగిసిన నేపథ్యంలో రాష్ట్రంలోని 235 మండలాల్లో తీవ్ర వర్షాభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు.
పంటలతో పాటు తాగునీటికి కూడా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అంచనా వేసినట్లు తెలిపారు. కరువు ప్రాంతాల్లో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై క్యాబినెట్ సబ్ కమిటీ చర్చించాలని మంత్రివర్గం నిర్దేశించినట్లు పేర్కొన్నారు. సబ్ కమిటీ త్వరగా సమావేశమై ఎల్‌నినో నష్ట నివారణ చర్యలపై చర్చించి నివేదికను కేబినెట్‌కు అందించాలని సూచించినట్లు చెప్పారు.
సబ్ కమిటీ నివేదికపై చర్చించేందుకు మంత్రివర్గం అత్యవసరంగా సమావేశం కానుందని తెలిపారు. దీంతో పాటు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు మంత్రులు వెల్లడించారు.





Leave a Reply