నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
అమృతరాణి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పిస్తామని ప్రభుత్వ విప్ విజయరమణారావు హామీ
పెద్దపల్లి, సెప్టెంబర్ 24 (ప్రతినిధి): సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని అమృతరాణి మృతి ఘటనలో బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఘటనకు బాధ్యులైన నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
రేగడి మద్దికుంటలో అమృతరాణి కుటుంబాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తదితరులు పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ.4,12,500 పరిహారానికి సంబంధించిన మంజూరు పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, ఇంజనీరింగ్ చదువుతున్న అమృతరాణి సింగరేణిలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో ఈ నెల 13న ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తులు ఆమెకు పురుగుల మందు తాగించి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు.
కేసులో నిందితులను పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేసినట్లు మంత్రి తెలిపారు. నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా పటిష్ఠమైన చార్జిషీట్ దాఖలు చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. భవిష్యత్తులో దళితులు, పేదలపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు శాఖ చర్యలు చేపట్టాలని సూచించారు.
బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.4.12 లక్షల పరిహారం అందిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ద్వారా మరో రూ.4.12 లక్షల పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ అమృతరాణి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లుతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి అయ్యే ఖర్చును తానే భరిస్తానని పేర్కొన్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ మహిళలపై వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని పేర్కొన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ సింగరేణిలో దళితులపై జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న ఘటనలపై విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, సింగిల్ విండో చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, బాధిత కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply