మార్కెట్‌ను కూల్చి నాలుగు నెలలైనా పనులు ప్రారంభించలేదని విమర్శ — నిర్మాణ జాప్యంపై అధికార యంత్రాంగం సమాధానం చెప్పాలని డిమాండ్
మంథని, అక్టోబర్ 03, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
మంథనిలో పురాతన ఆనవాళ్లు లేకుండా చేయాలన్నదే ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆలోచనగా కనిపిస్తోందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. శనివారం మంథనిలో నూతనంగా నిర్మించనున్న వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. మార్కెట్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యంపై మున్సిపల్ కమిషనర్, పబ్లిక్ హెల్త్ ఈఈ అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, నాలుగు నెలల క్రితం నూతన మార్కెట్ నిర్మాణం కోసం పాత మార్కెట్‌ను తొలగించినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. డిజైన్లకే నాలుగు నెలల సమయం పట్టిందని అధికారులు చెబుతున్నారని, నిర్మాణం పూర్తి కావడానికి ఇంకెంత సమయం పడుతుందో ఎమ్మెల్యే, అధికార యంత్రాంగం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మార్కెట్ పనుల జాప్యం వెనుక కమిషన్ల అంశం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేసిన పుట్ట మధూకర్, ఎన్నికల వరకు పనులను కొనసాగించే ఉద్దేశంతోనే ఆలస్యం చేస్తున్నారేమోనని ఆరోపించారు. మంథని చరిత్రను రూపుమాపుతూ ప్రతి నిర్మాణానికి తన తండ్రి పేరు పెట్టేందుకు శ్రీధర్ బాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
నియోజకవర్గంలోని యువత భవిష్యత్తు, ఉపాధి అవకాశాల కోసం ఐటీ కంపెనీలు, పరిశ్రమల ఏర్పాటుపై దృష్టి సారించలేదని ఆరోపించారు. చిరువ్యాపారుల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారు అధికంగా ఉంటారని, మార్కెట్‌ను తొలగించడంతో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
రెండు రోజుల క్రితం కాటారంలోని మార్కెట్‌ను కూడా సందర్శించానని, అక్కడి వ్యాపారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మధూకర్ తెలిపారు. కాళేశ్వరం ఆలయం కూల్చివేత విషయంలోనూ శ్రీధర్ బాబుపై ఆయన ఆరోపణలు చేశారు. వచ్చే ఏడాది పుష్కరాలు ఉన్న నేపథ్యంలో అప్పటిలోగా మార్కెట్ నిర్మాణం పూర్తి కాకపోతే చిరువ్యాపారులు మరింత నష్టపోతారని అన్నారు.
మున్సిపల్ భవనం, ఆసుపత్రి భవనాలు బాగున్నప్పటికీ కొత్త నిర్మాణాల పేరుతో పురాతన ఆనవాళ్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. శిలాఫలకం వేసి రెండేళ్లు కావస్తున్నా కొన్ని పనులు పూర్తి కాలేదని విమర్శించారు.
తనకు చిన్నప్పటి నుంచే మంథని మార్కెట్‌తో అనుబంధం ఉందని, తన తండ్రి ఇక్కడే గొడ్ల అంగడి నిర్వహించేవారని పుట్ట మధూకర్ గుర్తుచేశారు. అందుకే మార్కెట్ పరిస్థితిపై తాను ఆందోళన వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.
ప్రజలు, వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని, మార్కెట్ పనులు ఇప్పటివరకు ఎందుకు ప్రారంభించలేదో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సంబంధిత అధికార యంత్రాంగం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని పుట్ట మధూకర్ డిమాండ్ చేశారు.










Leave a Reply