జెండా ఆవిష్కరించిన డిపో అధ్యక్షులు పల్లెర్ల ఆంజనేయులు
మంథని | సెప్టెంబర్ 16 | AYUSH24 NEWS ప్రతినిధి
స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (SWF-CITU) 47వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మంథని డిపో వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
డిపో సెక్రటరీ రాపెల్లి రాజయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డిపో అధ్యక్షులు పల్లెర్ల ఆంజనేయులు జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు బూడిద గణేష్ మాట్లాడుతూ.. 1971 సెప్టెంబర్ 16న స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సంఘం ఏర్పాటైందని తెలిపారు. అప్పట్లో కార్మిక వర్గం పలు వర్గాలుగా విడిపోయిన పరిస్థితుల్లో కార్మికులను ఐక్యం చేసి వారి హక్కుల సాధన కోసం సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.
అనేక సందర్భాల్లో వివిధ కార్మిక సంఘాలను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. కార్మికుల హక్కుల సాధన కోసం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ నిరంతరం కార్మికులను చైతన్యపరుస్తూ, కార్మిక సంఘాలను ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు.
ఇటీవలి కాలంలో కార్మికులపై యాజమాన్యం పని భారాన్ని పెంచుతోందని, డ్యూటీలకు సంబంధించిన ఓవర్‌టైమ్ (OT) తగ్గిస్తోందని గణేష్ ఆరోపించారు. రెండు రోజుల పని దినాలతో ఉన్న డ్యూటీలను ఒకరోజు డ్యూటీగా మార్చడం, ఉన్న సర్వీసులకు అదనపు కిలోమీటర్లు జోడించడం వంటి చర్యల వల్ల కార్మికులకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు.
కార్మికులపై పనిభారాన్ని తగ్గించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్ల సందీప్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు వేల్పుల సురేష్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply