మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభం
విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధికి పౌష్టికాహారం ఎంతో అవసరమని వెల్లడి
మంథని, అక్టోబర్ 06, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
మంథని మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ (బాలుర) కళాశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్ మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్‌తో పాటు మున్సిపల్ పాలకవర్గ సభ్యులను కళాశాల యాజమాన్యం ముఖ్య అతిథులుగా ఆహ్వానించింది. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ కోట ఉష, ఉపాధ్యాయ బృందం చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్‌ను శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా వోడ్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందడంతో పాటు భోజనానికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా చదువుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు.
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో ఉదయం అల్పాహార పథకం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల హాజరు శాతం కూడా పెరిగిందని చైర్మన్ పేర్కొన్నారు.
విద్యార్థులకు విద్యతో పాటు అవసరమైన పౌష్టికాహారం అందించడం వారి ఆరోగ్యం, విద్యాభివృద్ధికి మరింత తోడ్పడుతుందని తెలిపారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఇటువంటి కార్యక్రమాలను కొనసాగించేందుకు మున్సిపల్ పాలకవర్గం ఎల్లప్పుడూ సహకరిస్తుందని వోడ్నాల శ్రీనివాస్ పేర్కొన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు మాచిడి రాజు గౌడ్, పెంటరి రాజు, ఎల్లెంకి వంశీధర్, నాయకులు జంబోజు సమ్మయ్య, ప్రభుత్వ జూనియర్ (బాలుర) కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply