చిన్నారులకు నోట్‌బుక్స్, పెన్నులు అందించి ప్రత్యేక పూజలు
దేవరకొండ, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
దేవరకొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్ సమీపంలోని గాంధీనగర్‌లో సిద్ధి వినాయక గణేష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో శుక్రవారం సాయంత్రం చిన్నారులతో భక్తిశ్రద్ధలతో సరస్వతీ మాత పూజ నిర్వహించారు.
మండప కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులకు నోట్‌బుక్స్, పెన్నులు, పూజా సామగ్రిని ఏర్పాటు చేశారు. చిన్నారులు నోట్‌బుక్స్, పెన్నులతో పూజలో పాల్గొనగా, వేద బ్రాహ్మణులు ప్రత్యేకంగా సరస్వతీ దేవి పూజ నిర్వహించారు. వందలాది మంది చిన్నారులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని సరస్వతీ మాత ఆశీస్సులు అందించాలని ప్రార్థించారు.
ఈ సందర్భంగా వేద బ్రాహ్మణులు మాట్లాడుతూ తొలి పూజ గణనాథునికి చేయడం ద్వారా విఘ్నాలు తొలగి శుభాలు కలుగుతాయని విద్యార్థులకు వివరించారు.
కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ దేవరకొండ పట్టణంలో 24 అడుగుల వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మండపాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించడంతో పాటు సరస్వతీ మాత వీణను ధరించిన రూపంలో విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు, ప్రజలకు ఆరోగ్యం, సుఖసంతోషాలు కలగాలని ప్రతిరోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఆదివారం 24 అడుగుల వినాయకుడి నిమజ్జనం
మండపంలో ఏర్పాటు చేసిన 24 అడుగుల వినాయకుడి నిమజ్జనాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పట్టణ పురవీధుల గుండా రంగురంగుల విద్యుత్ దీపాల అలంకరణలతో శోభాయాత్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహిళల కోలాటాలు, భక్తుల ఆటపాటలతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.

సరస్వతీ పూజలో పాల్గొన్న చిన్నారులకు ప్రధాన అర్చకులు ఆశీర్వచనం అందించగా, భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో మాడెం రాములు యాదవ్, పాపా నాయక్, సిద్ధి వినాయక గణేష్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు గంజి సాయికుమార్, ప్రధాన కార్యదర్శి షఫీ, కోశాధికారి గంజి వంశీ, తన్నీరు చంటి, కాసుల వంశీ, అంబటి మహేష్, ఏలే అరుణ్, వి. రాజు, బొడ్డుపల్లి హరీష్, మాడెం మంజునాథ్, మాడెం ఆదిత్య, గోగికార్ ఆకాష్, గోగికార్ రిషికేష్, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు.









Leave a Reply