లారీ–ఆటో ఢీ.. ముగ్గురు మహిళలు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
మంచిర్యాల: సెప్టెంబర్ 28 (AYUSH24 News ప్రతినిధి)
మంచిర్యాల జిల్లా సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ–ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు మందమర్రి మండలానికి చెందిన మహిళలుగా గుర్తించారు.
ప్రమాద ఘటనపై శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు వ్యక్తిగతంగా రూ.25 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు క్షతగాత్రులకు రూ.10 వేల చొప్పున వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందిస్తానని తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే మంచిర్యాల జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడిన మంత్రి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు.
క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని హైదరాబాద్ నుంచి ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply