అగా ఖాన్ ఫౌండేషన్ చైర్మన్ ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో ముఖ్యమంత్రి భేటీ
హైదరాబాద్, సెప్టెంబర్ 15 – అయుష్ 24 న్యూస్
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో అగా ఖాన్ ఫౌండేషన్ భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని చారిత్రక తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అగా ఖాన్ ఫౌండేషన్ చైర్మన్ ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణలో వారసత్వ సంపద పరిరక్షణ, మూసీ నది పునరుజ్జీవనం, పాతబస్తీ అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ తదితర అంశాలపై ఇరువురు చర్చించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
హైదరాబాద్‌లోని చారిత్రాత్మక భవనాల పునరుద్ధరణకు అగా ఖాన్ ఫౌండేషన్ సహకారం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తెలంగాణలోని వారసత్వ కట్టడాల పరిరక్షణ, పునరుద్ధరణలో ఫౌండేషన్ చేస్తున్న కృషిని సీఎం ప్రశంసించారు.
అగా ఖాన్ ఫౌండేషన్ సహకారంతో శాసనమండలి భవనాన్ని పునరుద్ధరించిన విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే హైదరాబాద్‌లోని చారిత్రాత్మక కుతుబ్‌షాహీ సమాధుల పునరుద్ధరణలో అగా ఖాన్ ఫౌండేషన్ భాగస్వామ్యాన్ని ప్రస్తావించారు.
మూసీ నది పునరుజ్జీవనం కోసం తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తోందని సీఎం తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతంలోని చారిత్రాత్మక కట్టడాలను కూడా ఈ ప్రణాళికలో భాగంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధి, వారసత్వ సంపద పరిరక్షణతో పాటు హైదరాబాద్‌ను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని అగా ఖాన్ ఫౌండేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
– అయుష్ 24 న్యూస్










Leave a Reply