ఈ నెల 27న హన్మకొండలో సదస్సు.. మేధావులు, తెలంగాణవాదులు పాల్గొనాలని పిలుపు
హన్మకొండ, సెప్టెంబర్ 15 – అయుష్ 24 న్యూస్
‘దేవాదుల ప్రాజెక్టు – నాడు–నేడు’ అనే అంశంపై ఈ నెల 27న హన్మకొండలో నిర్వహించనున్న సదస్సుకు సంబంధించి తెలంగాణ వికాస సమితి ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం మంగళవారం హన్మకొండలో జరిగింది. ఈ సమావేశానికి కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ చింతకాయల దినేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చింతకాయల దినేష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం సాగునీరు, తాగునీటి రంగాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు దేవాదుల ప్రాజెక్టు ద్వారా సాగునీరు, తాగునీరు అందించాల్సి ఉందని తెలిపారు.
అయితే దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పూర్తిస్థాయిలో ముందుకు సాగడం లేదని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు పురోగతిపై సమగ్రంగా చర్చించడంతో పాటు, ‘దేవాదుల ప్రాజెక్టు – నాడు–నేడు’ అంశంపై ఈ నెల 27న హన్మకొండలో సదస్సు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సదస్సుకు మేధావులు, తెలంగాణవాదులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చింతకాయల దినేష్ కుమార్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ వికాస సమితి నాయకులు భిక్షపతి నాయక్, మేడిపల్లి శోభన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్ బాబు, ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రవి, అడ్వకేట్లు శివరాజ్, కిరణ్, శ్రీనివాస్, కేయూ స్కాలర్స్ కత్తేరపల్లి దామోదర్, పాలమాకుల కొమురయ్య, మోతె చిరంజీవి, జెట్టి రాజేందర్, రాజగోపాల్, తిరుపతి, నాగరాజ్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
– అయుష్ 24 న్యూస్










Leave a Reply