రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారుల సందడి.. ముస్తాబు చేస్తున్న తల్లిదండ్రులు
పాఠశాలల్లో ఉట్టి పండుగ సంబరాలు.. ఫొటోషూట్లతో మధుర జ్ఞాపకాలు
తెలుగు రాష్ట్రాలు, సెప్టెంబర్ 4 | అయుష్ 24 న్యూస్
శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఇంటింటా కృష్ణాష్టమి వేడుకలు సందడిగా ప్రారంభమయ్యాయి. చిన్ని కృష్ణుడిగా, రాధగా తమ పిల్లలను అందంగా ముస్తాబు చేస్తూ తల్లిదండ్రులు పండుగ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు.

ఒకవైపు గోపాలుడి వేషధారణలో చిన్నారులను ముస్తాబు చేస్తుంటే.. మరోవైపు రాధగా అమ్మాయిలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. నెమలీక కిరీటం, పిల్లనగ్రోవి, రంగురంగుల వస్త్రాలు, ఆభరణాలతో చిన్నారులను అలంకరించి ఫొటోలు, వీడియోలు తీస్తూ తల్లిదండ్రులు ఈ మధుర క్షణాలను జ్ఞాపకాలుగా పదిలపరుచుకుంటున్నారు.
పాఠశాలల్లోనూ రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారులు సందడి చేస్తూ ఉట్టి పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పాఠశాల ప్రాంగణాలు చిన్నికృష్ణుడి అల్లరితో, గోపికల సందడితో పండుగ శోభను సంతరించుకున్నాయి.
మారుతున్న కాలానికి అనుగుణంగా నేటి తరం తల్లిదండ్రులు తమ చిన్నారులకు సంప్రదాయ వేషధారణలు వేయిస్తూ భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలను పరిచయం చేస్తున్నారు. కొందరు అమ్మాయిలకు కృష్ణుడి వేషధారణ, అబ్బాయిలకు రాధ వేషధారణ వేయిస్తూ వినూత్నంగా ముస్తాబు చేస్తున్నారు.

చిన్నారులను గుర్తుపట్టలేనంత అందంగా అలంకరించి, వారి చిత్రమాలికలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పండుగల ఆచారాలను కొనసాగిస్తూ.. పిల్లలతో కలిసి వేడుకలను జరుపుకోవడం ద్వారా చిన్ననాటి మధుర జ్ఞాపకాలను వారికి అందిస్తున్నారు.
చిన్ని కృష్ణుడి చిరునవ్వులు.. రాధమ్మ అందాలు.. ఉట్టి పండుగ సందడి.. తల్లిదండ్రుల ఆనందం.. ఇలా శ్రీకృష్ణాష్టమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో పండుగ శోభను నింపుతున్నాయి.
— అయుష్ 24 న్యూస్
ది వాయిస్ ఆఫ్ ట్రూత్










Leave a Reply