సమస్యను పరిష్కరించాలని కోరుతున్న కాలనీవాసులు — చర్యలు చేపడతామని శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ గౌడ్ వెల్లడి
దేవరకొండ, సెప్టెంబర్ 30, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
దేవరకొండ పట్టణంలోని 15వ వార్డులో ఉన్న ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల ఎదురుగా రోడ్డుపై వర్షపు నీరు, మురుగు నీరు నిలిచి దుర్గంధభరితంగా మారుతోందని పాఠశాల ఉపాధ్యాయులు, కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ప్రతిరోజూ మురికి నీటిని దాటుకుంటూ పాఠశాలకు వెళ్లాల్సి వస్తోందని, ఉపాధ్యాయులతో పాటు ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
వర్షం కురిసిన సమయంలో నీరు ఓపెన్ డ్రైనేజీల్లోకి వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో రోడ్డుపైనే నిలిచి బురదగా మారుతోందని కాలనీవాసులు పేర్కొన్నారు. నిల్వ నీటితో దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ నీరు తొలగించేందుకు ప్రత్యామ్నాయ మార్గం, శాశ్వత పరిష్కారం చేపట్టడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. సమస్య రోజురోజుకూ జటిలంగా మారుతోందని, నిల్వ నీటిలో దోమలు పెరిగితే మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాల ముప్పు ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
పట్టణ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇదే వార్డుకు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారని, పాఠశాల వద్ద నెలకొన్న సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రజల నుంచి వచ్చిన సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరుగుతోందని మున్సిపల్ అధికారులపై పలువురు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాల రోడ్డుపై నిలుస్తున్న నీటిని తొలగించడంతో పాటు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వార్డు ప్రజలు కోరుతున్నారు.
చర్యలు చేపడతాం: శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ గౌడ్
ఉర్దూ మీడియం పాఠశాల వద్ద వర్షపు నీరు నిలిచి దుర్గంధభరితంగా మారుతోందనే ఫిర్యాదు తనకు అందిందని శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్ గౌడ్ తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.









Leave a Reply