వేర్వేరు ప్రమాదాల్లో మరో 26 మందికి తీవ్ర గాయాలు
హైదరాబాద్: సెప్టెంబర్ 26 (AYUSH24 News ప్రతినిధి)
తెలంగాణలో జరిగిన గణేష్ నిమజ్జనోత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చోటుచేసుకున్న వేర్వేరు ప్రమాదాల్లో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 26 మంది తీవ్రంగా గాయపడినట్లు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మృతుల్లో విధి నిర్వహణలో ఉన్న ఓ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నట్లు తెలిపారు.
నిమజ్జనం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరిగిన ఘటనల వల్ల ఈ ప్రాణనష్టం సంభవించినట్లు డీజీపీ పేర్కొన్నారు. బందోబస్తు విధుల్లో ఉన్న ఓ ఎస్సై రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, పఠాన్చెరువులో ఆరుగురు యువకులు, ఖైరతాబాద్, నిర్మల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు.
అలాగే డీజే సౌండ్స్ కారణంగా గుండెపోటుకు గురై మరో వ్యక్తి మృతి చెందినట్లు డీజీపీ వెల్లడించారు. పలు ఘటనల్లో మొత్తం 13 మంది మృతి చెందడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది నిమజ్జనం నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, వినాయక చవితి సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 1.24 లక్షల వినాయక విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠించినట్లు డీజీపీ తెలిపారు.
ప్రజలు తమ ఇళ్లు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో ఏర్పాటు చేసుకున్న విగ్రహాలను కూడా కలుపుకుంటే రాష్ట్రవ్యాప్తంగా వినాయక విగ్రహాల సంఖ్య సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ఉంటుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు.
ఉత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్రంలోని వివిధ చెరువులు, జలాశయాల వద్ద నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులను నియంత్రించడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ట్రాఫిక్, భద్రతను పర్యవేక్షించినట్లు డీజీపీ వివరించారు.
అయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply