అండర్-14, అండర్-17 బాలబాలికల విభాగాల్లో పోటీలు — సుమారు 150 మంది విద్యార్థుల పాల్గొనడం
పెద్దపల్లి, అక్టోబర్ 04, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
పెద్దపల్లి పట్టణంలోని నందన గార్డెన్స్‌లో నిర్వహించిన అండర్-14, అండర్-17 బాలబాలికల జిల్లాస్థాయి ఎస్జీఎఫ్ కరాటే పోటీలను ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆత్మరక్షణ, ఆరోగ్యం, శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసానికి కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు స్వీయరక్షణ కోసం కరాటే నేర్చుకోవడం ఉపయోగకరమని పేర్కొన్నారు.
విద్యార్థినీ విద్యార్థులు క్రీడల్లో రాణించి జిల్లాకు, తెలంగాణకు, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. క్రీడల అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని తెలిపారు.
జిల్లాస్థాయి కరాటే పోటీలకు పెద్దపల్లి జిల్లాలోని వివిధ మండలాల నుంచి సుమారు 150 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. వివిధ విభాగాల్లో విజయం సాధించిన విద్యార్థులు ఈ నెల 10వ తేదీన జగిత్యాలలో నిర్వహించనున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సారయ్య గౌడ్, పెద్దపల్లి జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ కనుకుంట్ల లక్ష్మణ్, నోడల్ ఆఫీసర్ శోభారాణి, సీనియర్ కరాటే మాస్టర్ మొండయ్య, నిర్వాహక సభ్యులు కర్ర వెంకటేష్, కల్వల రమేష్, న్యాయ నిర్ణేతలు కొయ్యడ మొండయ్య, కావేటి సమ్మయ్య, శంకర్, శ్రీనివాస్, చందు, లక్ష్మణ్, కనకేష్, నాగరాజు, పీఈటీలు కుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply