అమరుల త్యాగాల స్ఫూర్తితో తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపించాలి
మెదక్, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్: తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, గనులు–భూగర్భశాస్త్ర శాఖల మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రాచరిక వ్యవస్థ నుంచి ప్రజా పాలన వైపు తెలంగాణలో జరిగిన చారిత్రక పరిణామాల్లో ఎందరో మహనీయుల త్యాగాలు కీలకంగా నిలిచాయని అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో ప్రాధాన్యత కలిగిన రోజని పేర్కొన్నారు.
హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనం కావడంతో ప్రజా పాలనకు నాంది పలికిందని, ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహిస్తోందని తెలిపారు.
నేడు ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కుల కోసం నాటి కాలంలో అనేక మంది పోరాటాలు, త్యాగాలు చేశారని మంత్రి గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు, స్వాతంత్ర్య సమరయోధుల సేవలను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

1947 ఆగస్టు 15న భారత్ స్వాతంత్య్రం పొందినప్పటికీ అప్పటి హైదరాబాద్ సంస్థానంలో ప్రత్యేక పరిస్థితులు కొనసాగాయని తెలిపారు. హైదరాబాద్ సంస్థానం తెలుగు, కన్నడ, మరాఠీ భాషలు, విభిన్న సంస్కృతులతో కూడిన ప్రాంతాలను కలిగి ఉండేదని పేర్కొన్నారు.
ప్రజా పాలన కోసం జరిగిన పోరాటాల్లో ఎందరో మహనీయులు చేసిన త్యాగాల ఫలితంగా ప్రజాస్వామ్య పాలనకు మార్గం సుగమమైందని మంత్రి అన్నారు.
అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం అందరి బాధ్యత అని మంత్రి వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా ప్రజలకు తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
— అయుష్ 24 న్యూస్
The Voice of Truth










Leave a Reply