రెండు పెండింగ్ డీఏలపై ఉత్తర్వులు — అక్టోబర్ వేతనంతో పెరిగిన డీఏ చెల్లింపు
డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాల్లో వాయిదాల వారీగా జమ చేయనున్న ప్రభుత్వం
హైదరాబాద్, అక్టోబర్ 07, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు పెండింగ్ డీఏలకు సంబంధించిన బకాయిల చెల్లింపుతో పాటు సాధారణ డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సాధారణ డీఏను జనవరి 2024 నుంచి 33.67 శాతం నుంచి 37.31 శాతానికి, అనంతరం జూలై 2024 నుంచి 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచారు.
2020 పే స్కేల్లోని ఉద్యోగులకు డీఏను 37.31 శాతం నుంచి 40.04 శాతానికి పెంచారు. 2015 పే స్కేల్ ఉద్యోగులకు డీఏను 73.344 శాతం నుంచి 78.06 శాతానికి, జూలై 2024 నుంచి 78.06 శాతం నుంచి 81.728 శాతానికి పెంచినట్లు పేర్కొన్నారు.
యూజీసీ, ఏఐసీటీఈ పే స్కేల్ పరిధిలోని ఉద్యోగులకు కూడా డీఏ పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
పెరిగిన డీఏను అక్టోబర్ 2026 వేతనంతో కలిపి నవంబర్ 1న ఉద్యోగులకు అందించనున్నట్లు తెలిపింది. డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు పేర్కొంది.
జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఉన్న డీఏ బకాయిలను 33 వాయిదాల్లో, జూలై 2024 నుంచి సెప్టెంబర్ 2026 వరకు ఉన్న బకాయిలను 27 వాయిదాల్లో చెల్లించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.










Leave a Reply