అయుష్ 24 న్యూస్ ప్రతినిధి
హైదరాబాద్, సెప్టెంబర్ 16: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి బాధ్యతల మార్పుపై పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రస్తుత ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ సుమారు పది నెలల పాటు విదేశాల్లో ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన ఉన్నత విద్యను అభ్యసించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, ఆమె ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.
ఈ నెల 18న పార్టీ రాష్ట్ర ఇన్చార్జి బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు, అనంతరం సెప్టెంబర్ 21న లండన్‌కు వెళ్లనున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. ఉన్నత విద్యా కోర్సులో చేరేందుకు ఆమెకు కొద్ది నెలల క్రితమే అవకాశం వచ్చినప్పటికీ, ఆర్థిక కారణాలతో అప్పట్లో చేరలేదని సమాచారం.
తాజాగా లండన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి స్కాలర్షిప్ మంజూరు కావడంతో కోర్సులో చేరేందుకు ఆమె ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె ఇప్పటికే ఏఐసీసీ నాయకత్వానికి తెలియజేసినట్లు గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్చార్జి ఎంపికపై అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడు ఎస్. చెల్లకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు ముకుల్ వాస్నిక్‌తో పాటు పార్టీ సీనియర్ నేత శక్తిసిన్హా గోహిల్, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కడిక్కున్నిల్ సురేష్ పేర్లను పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే, తుది నిర్ణయం కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకోవాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త రాష్ట్ర ఇన్చార్జిని నియమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.










Leave a Reply