ప్రజల ఓటు హక్కు కోసం చివరి వరకు పోరాడతామని స్పష్టం
300 మందికి పైగా ఎంపీలను కలవడానికి సీఈసీ నిరాకరించారంటూ ప్రశ్నలు
పెద్దపల్లి, అక్టోబర్ 07, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ప్రయత్నాలను చూస్తూ ఊరుకోబోమని, ప్రజల ఓటు హక్కు పరిరక్షణ కోసం చివరి వరకు పోరాడతామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించిన పరిణామాలను ప్రపంచం గమనిస్తోందని, ఎన్నికల కమిషన్ అత్యంత కీలకమైన రాజ్యాంగ సంస్థగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
300 మందికి పైగా ఎంపీలు ఎన్నికల కమిషనర్‌ను కలిసి తమ అభిప్రాయాలు, ఆందోళనలను తెలియజేసేందుకు వెళ్లినప్పటికీ వారితో సమావేశం కాకపోవడం ఏ విధమైన ప్రజాస్వామ్య పద్ధతి అని వంశీకృష్ణ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులతో చర్చించకుండా నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.
శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న ఎంపీలను పోలీసులు అడ్డుకోవడం, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రశ్నిస్తున్న ప్రజాప్రతినిధుల గొంతును బలప్రయోగంతో అణచివేయలేరని పేర్కొన్నారు.
ఫారం-6లో కీలక మార్పులను ఇతర ఎన్నికల కమిషన్ సభ్యులతో తగిన సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా ఎలా చేపడతారని వంశీకృష్ణ ప్రశ్నించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలక నిర్ణయాల్లో పారదర్శకత, సంప్రదింపులు, జవాబుదారీతనం ఉండాలని డిమాండ్ చేశారు.
పశ్చిమ బెంగాల్లో సుమారు 90 లక్షల ఓట్లు తొలగించబడ్డాయని, వాటిలో 93 శాతం ఓట్లు తిరిగి పునరుద్ధరించబడ్డాయని పేర్కొన్న వంశీకృష్ణ, ఓటర్ల జాబితా నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషన్ దేశ ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని కోరారు.
“ఓటు కేవలం ఒక సంఖ్య కాదు.. ప్రతి ఓటు వెనుక ఒక పౌరుడి హక్కు ఉంది. ఆ హక్కుకు సంబంధించిన ప్రతి నిర్ణయం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా ఉండాలి” అని వంశీకృష్ణ అన్నారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంపిక ప్రక్రియలో భాగస్వామిగా ఉన్నారని గుర్తుచేస్తూ, అలాంటి రాజ్యాంగబద్ధమైన పాత్ర కలిగిన ప్రతిపక్ష నేతతో ఎన్నికల కమిషనర్ సమావేశం కాకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
దేశ ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కొనసాగాలంటే ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, జవాబుదారీతనంతో పనిచేయాలని వంశీకృష్ణ అన్నారు.
“ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన విషయం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజల ఓటు హక్కు, ఎన్నికల సంస్థల విశ్వసనీయతకు సంబంధించిన విషయం. ప్రజల ఓటు హక్కును, ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రతను కాపాడే వరకు మా పోరాటం కొనసాగుతుంది” అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.










Leave a Reply