రేగడి మద్దికుంటలో అక్షితరాణి కుటుంబానికి పరామర్శ
రూ.4.12 లక్షల ఆర్థిక సహాయం మంజూరు పత్రం అందజేత
ఇందిరమ్మ ఇల్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించేందుకు చర్యలు: ప్రభుత్వ విప్ విజయరమణ రావు
సుల్తానాబాద్, సెప్టెంబర్ 24 (ప్రతినిధి):
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థిని అక్షితరాణి మృతి నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తదితరులు పరామర్శించారు.

అక్షితరాణి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓదార్చారు. ప్రభుత్వం తరఫున మంజూరైన రూ.4,12,500 ఆర్థిక సహాయానికి సంబంధించిన మంజూరు పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చట్టప్రకారం విచారణ జరిపి, నేరం రుజువైతే కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మహిళలు, పేదలు, దళితులపై వేధింపులు, హింస పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
బాధిత కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు, ఔట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించే దిశగా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ విజయరమణ రావు హామీ ఇచ్చారు.
మహిళలపై వేధింపులు, హింసకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు.










Leave a Reply