గాంధీ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలి: మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అయిలి ప్రసాద్
మంథని, అక్టోబర్ 02, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మంథని గాంధీ చౌక్‌లో కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా అయిలి ప్రసాద్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింసా మార్గంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారని పేర్కొన్నారు. సామాన్య ప్రజలను స్వాతంత్ర్య పోరాటంలో భాగస్వాములను చేయడంతో పాటు అంటరానితనం నిర్మూలన, సామాజిక సమానత్వం కోసం కృషి చేశారని తెలిపారు.
దక్షిణాఫ్రికాలో పౌర హక్కుల కోసం పోరాడిన గాంధీ, అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చి స్వాతంత్ర్య ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారని గుర్తుచేశారు. సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం వంటి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు.
శాంతి, అహింస మార్గాలతో గాంధీజీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారని అయిలి ప్రసాద్ అన్నారు. దేశ స్వాతంత్ర్యం, ప్రజల హక్కులు, సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం కోసం ఆయన చేసిన కృషిని స్మరించుకుంటూ, నేటి యువత గాంధీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజసేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, గ్రామ సర్పంచులు, ఉప సర్పంచులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply