ఉత్సాహంగా సాగిన నిమజ్జన ఊరేగింపు.. భీమనపల్లి చెరువు వద్ద భద్రతపై సీఐ వెంకట్రెడ్డి సూచనలు
దేవరకొండ, సెప్టెంబర్ 24 (ప్రతినిధి): మైనంపల్లి కోర్రతండాలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా గణేశుని శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.
తండా యువకులంతా కలిసి ప్రతిష్ఠించి నవరాత్రుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన గణనాథుడిని మైనంపల్లి కోర్రతండా నుంచి దేవరకొండ పట్టణం వరకు అంగరంగ వైభవంగా ఊరేగించారు. గణేశుని పాటలు, యువకుల నృత్యాలు, ఆటపాటల మధ్య శోభాయాత్ర ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. అనంతరం గణనాథుడిని కొండ భీమనపల్లి చెరువులో నిమజ్జనం చేశారు.
నిమజ్జన కార్యక్రమంలో దేవరకొండ సీఐ వెంకట్రెడ్డి పాల్గొని భీమనపల్లి చెరువు వద్ద తండా యువకులకు పలు భద్రతా సూచనలు చేశారు. నిమజ్జనం సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలకు తావులేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
తమ తండా వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని భద్రతా సూచనలు చేసిన సీఐ వెంకట్రెడ్డికి తండా యువకులు కృతజ్ఞతలు తెలిపారు.









Leave a Reply