కీసర సీఐ పాత్రపైనా కేసు నమోదు చేసిన ఏసీబీ
హైదరాబాద్, సెప్టెంబర్ 17, అయుష్ 24 న్యూస్: మేడ్చల్–మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్‌స్టేషన్‌కు చెందిన సబ్ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) ద్యాప జ్ఞానేందర్ రెడ్డి రూ.5 లక్షల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు. సెప్టెంబర్ 16 రాత్రి కీసర ప్రాంతంలో ఏసీబీ సిటీ రేంజ్-1 బృందం ఈ ట్రాప్ నిర్వహించినట్లు ఏసీబీ వెల్లడించింది.
ఏసీబీ వివరాల ప్రకారం.. కీసర పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో ఫిర్యాదుదారుడు, అతని స్నేహితుడికి స్టేషన్ బెయిల్ ఇప్పించడంతో పాటు వేధింపులు లేకుండా చూసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కీసర ఇన్స్పెక్టర్, ఎస్హెచ్ఓ అర్కపల్లి ఆంజనేయులు సూచనల మేరకు ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి లంచం తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది.
సెప్టెంబర్ 16న రాత్రి సుమారు 11.25 గంటల సమయంలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.5 లక్షలు స్వీకరిస్తుండగా ఎస్ఐను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం మొత్తాన్ని అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసులో ఇన్స్పెక్టర్ అర్కపల్లి ఆంజనేయులుపై కూడా కేసు నమోదు చేసినట్లు ఏసీబీ తెలిపింది. అనంతరం కీసర పోలీస్‌స్టేషన్‌తో పాటు సంబంధిత అధికారుల నివాసాల్లో తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
ఏసీబీ అధికారులు ఇద్దరు నిందితులను నాంపల్లిలోని SPE & ACB కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో జ్యుడీషియల్ రిమాండ్ కోసం హాజరుపరచనున్నట్లు వెల్లడించారు. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా వెల్లడించలేదు.
— అయుష్ 24 న్యూస్
The Voice of Truth










Leave a Reply