100 మంది కరాటే విద్యార్థులకు గోంగూర ఆకుకూరల పంపిణీ – కరాటేతో క్రమశిక్షణ, ఆరోగ్యం, ఆత్మరక్షణ సాధ్యం: ప్రముఖుల పిలుపు
మిర్యాలగూడ, జూలై 26 (AYUSH 24 NEWS):
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక హౌసింగ్ బోర్డ్‌లో సుమన్ షోటోఖాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే కరాటే శిక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కరాటే సాధనలో ప్రతిభ కనబరిచిన 100 మంది విద్యార్థులకు గోంగూర ఆకుకూరలను బహుమతిగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి జననేత్రి ఫౌండేషన్ అధినేత డాక్టర్ మునీర్, సుమన్ షోటోఖాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా చీఫ్ మాస్టర్ బూడిద సైదులు, 5వ వార్డు కౌన్సిలర్ లావూరి అరుణ సుధాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ మునీర్ మాట్లాడుతూ, సమాజంలో మహిళలపై జరుగుతున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంటిలోని ఆడ, మగ పిల్లలు తప్పనిసరిగా కరాటే శిక్షణ పొందాలని సూచించారు. కరాటే ద్వారా ఆత్మరక్షణతో పాటు ధైర్యం, క్రమశిక్షణ పెంపొందుతాయని అన్నారు.
చీఫ్ మాస్టర్ బూడిద సైదులు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా మిర్యాలగూడలో కరాటేకు పునాది వేసి వేలాది మంది విద్యార్థులకు శిక్షణ అందించానని తెలిపారు. తన శిష్యులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా తన శిష్యుడు మాస్టర్ రామకృష్ణ నాయక్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం గర్వకారణమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కరాటే నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
5వ వార్డు కౌన్సిలర్ లావూరి అరుణ సుధాకర్ మాట్లాడుతూ, తమ వార్డులోని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు కరాటే శిక్షణ అందించాలని కోరారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరాటేను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తిగా మాస్టర్ రామకృష్ణ నాయక్ సేవలను కొనియాడారు.
మాస్టర్ బాండావత్ రామకృష్ణ నాయక్ మాట్లాడుతూ, చిన్ననాటి నుంచి కరాటేనే తన జీవిత లక్ష్యంగా ఎంచుకుని వందలాది అవార్డులు సాధించానని తెలిపారు. మిర్యాలగూడలో అత్యాధునిక డోజో ఏర్పాటు చేసి ప్రతి ఆదివారం విద్యార్థులకు పండ్లు, కూరగాయలు పంపిణీ చేయడం ద్వారా ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను సుమన్ షోటోఖాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియాలో చేర్పించి ఆత్మరక్షణ విద్యను నేర్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రవళిక, అజయ్, కిషోర్, కార్తికేయ తదితరులు పాల్గొన్నారు.

