లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో గాజుల అభినయ్ రాజ్ జ్ఞాపకార్థం నిర్వహణ
2026–27 విద్యా సంవత్సరంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేస్తాం: గాజుల రాజేష్, ఉషారాణి దంపతులు
కళాశాలకు వాటర్ ఫిల్టర్ అందిస్తామని లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య హామీ
దేవరకొండ, అక్టోబర్ 08, 2026, AYUSH24 NEWS ప్రతినిధి:
ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని కంటి వారోత్సవాల్లో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎంకేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)లో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎంజేఎఫ్ లయన్ గాజుల రాజేష్, జోన్ చైర్మన్ గాజుల ఉషారాణి దంపతుల కుమారుడు కీర్తిశేషులు గాజుల అభినయ్ రాజ్ జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమావత్ రవి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య మాట్లాడుతూ, గాజుల అభినయ్ రాజ్ ఇదే కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థి అని గుర్తుచేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అభినయ్ రాజ్ ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు.
ప్రతిభావంతులైన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్

ఈ సందర్భంగా గాజుల రాజేష్, ఉషారాణి దంపతులు మాట్లాడుతూ, తమ కుమారుడు అభినయ్ రాజ్ ఇదే కళాశాలలో విద్యను అభ్యసించాడని గుర్తుచేసుకున్నారు. గాజుల రాజేష్ మాట్లాడుతూ, తాను కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం (అల్యూమ్ని కమిటీ) చైర్మన్‌గా కొనసాగుతున్నట్లు తెలిపారు.
తమ కుమారుడి జ్ఞాపకార్థం 2026–27 విద్యా సంవత్సరంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేయనున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు అభినయ్ రాజ్ జ్ఞాపకాలను నిలిపే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
కళాశాలకు వాటర్ ఫిల్టర్ అందిస్తామని హామీ
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమావత్ రవి మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ చేపడుతున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. గత మూడు సంవత్సరాలుగా క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గమనిస్తున్నానని, తాను కూడా లయన్స్ క్లబ్‌లో సభ్యుడిగా చేరినట్లు పేర్కొన్నారు.

కళాశాల విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాటర్ ఫిల్టర్ అందించాలని లయన్స్ క్లబ్ అధ్యక్షుడిని కోరారు. దీనిపై స్పందించిన గుద్దేటి జంగయ్య, కళాశాలకు వాటర్ ఫిల్టర్ అందించేందుకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారి చిలుకూరి కాశీనాథ్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రమావత్ రవి, జోన్ చైర్మన్ గాజుల ఉషారాణి, ఎంజేఎఫ్ లయన్ గాజుల రాజేష్, సీనియర్ లయన్స్ వనం శ్రీనివాసులు, వస్కుల సత్యనారాయణ, ఆప్తమాలజిస్ట్ ఆనంద్, హరి, కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ సి. లింగమయ్య, సీఓఈ జి. లింగారెడ్డి, హెల్త్ భాగ్య కోఆర్డినేటర్ వి. వెంకటేష్, డాక్టర్ సిహెచ్ రామరాజు, ఆర్. నాగేందర్, అద్దంకి శీను, బి. సురేష్, జగపతిబాబు, నర్మదా దేవి, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply