ఒంటి కాలుతో విద్యాభ్యాసం… కృత్రిమ కాలు కోసం ఎదురుచూపులు
కమలాపూర్ విద్యార్థిని పల్లపు ఆకాంక్ష హృదయవిదారక జీవన పోరాటం
దేవరకొండ | AYUSH24 NEWS
“అంగవైకల్యం శరీరానికే… ఆత్మవిశ్వాసానికి కాదు” అనే మాటను నిజం చేస్తూ, ఒంటి కాలుతో తన చదువును కొనసాగిస్తూ జీవితంలో ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేస్తోంది దేవరకొండ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన పల్లపు ఆకాంక్ష.
తొమ్మిది సంవత్సరాల వయస్సులో బోన్ క్యాన్సర్ బారిన పడిన ఆకాంక్షకు ఎడమ కాలును తొలగించాల్సి వచ్చింది. అప్పటి నుంచి కర్ర సాయంతోనే నడుస్తూ ఎన్నో కష్టాలను అధిగమిస్తూ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తోంది.
పేద కుటుంబానికి చెందిన ముగ్గురు కుమార్తెల్లో ఆకాంక్ష రెండవ సంతానం. ప్రస్తుతం హైదరాబాద్లో డిగ్రీ రెండో సంవత్సరం (బి.కాం) చదువుతోంది. చదువులో ముందుకు వెళ్లి భవిష్యత్తులో బ్యాంకు ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలవాలనే గొప్ప లక్ష్యంతో కృషి చేస్తోంది.

అయితే ప్రతి రోజు కళాశాలకు వెళ్లడం, ప్రయాణాలు చేయడం, సాధారణ పనులు కూడా కర్ర సాయంతోనే చేయాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తనకు ఒక కృత్రిమ ఎడమ కాలు ఏర్పాటు చేసి సహాయం చేయాలని దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలను ఆకాంక్ష హృదయపూర్వకంగా వేడుకుంటోంది.
“నాకు ఒక కృత్రిమ కాలు లభిస్తే… నేను మరింత ఆత్మవిశ్వాసంతో చదువు పూర్తి చేసి, ఉద్యోగం సాధించి, నా కుటుంబానికి అండగా నిలుస్తాను” అని ఆకాంక్ష ఆశాభావం వ్యక్తం చేసింది.
ఈ యువతి జీవితంలో వెలుగు నింపేందుకు దాతృత్వ హృదయం కలిగిన వారు ముందుకు వచ్చి ఆమె ఆకాంక్షను నిజం చేయాలని AYUSH24 NEWS విజ్ఞప్తి చేస్తోంది.
– AYUSH24 NEWS

