పెద్దపల్లి: పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన పెండింగ్ రైల్వే సమస్యలు, అభివృద్ధి పనులను త్వరితగతిన ముందుకు తీసుకెళ్లాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌ను కోరారు.
ఇటీవల రైల్వే దక్షిణ మధ్య జోన్ జనరల్ మేనేజర్‌ను కలిసి పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాలకు సంబంధించిన పలు పెండింగ్ డిమాండ్లపై ఎంపీ ప్రత్యేకంగా చర్చించారు. ప్రజలకు నేరుగా ఉపయోగపడే రైల్వే మౌలిక వసతుల పనులను ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఓదెల రైల్వే స్టేషన్ పరిధిలోని ఎల్సీ-30కు సంబంధించి శాశ్వత పరిష్కారం కల్పించాలని ఎంపీ కోరారు. దీనిపై రైల్వే అధికారులు ఇప్పటికే ఆర్యూబీ-74ఏ (Road Under Bridge) నిర్మాణ పనులను చేపడుతున్నారని, ఇందుకు సంబంధించిన శాంక్షన్ కూడా పూర్తయిందని తెలిపారు.
ఆర్యూబీ-74ఏ నిర్మాణాన్ని మార్చి 2027 నాటికి పూర్తి చేస్తామని రైల్వే అధికారులు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినట్లు ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. ఓదెల ప్రాంత ప్రజలకు ఎంతోకాలంగా ఎదురవుతున్న రాకపోకల సమస్యకు ఈ ఆర్యూబీ నిర్మాణం పూర్తయితే శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందన్నారు.
రైల్వే అధికారులు ఇచ్చిన హామీ మేరకు పనుల పురోగతిపై నిరంతరం ఫాలోఅప్ చేస్తూ, ఆర్యూబీ-74ఏ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు సంబంధించిన పెండింగ్ రైల్వే సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలను నిరంతరం కొనసాగిస్తామని ఆయన తెలిపారు










Leave a Reply