దేవరకొండ చేనేత సహకార సంఘ భవనంలో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు
దేవరకొండ, సెప్టెంబర్ 21 (ప్రతినిధి):
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తొలితరం ఉద్యమ నాయకుడు, న్యాయవాది, తెలంగాణ సామాజిక చైతన్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని దేవరకొండ చేనేత సహకార సంఘం చైర్మన్ చేరుపల్లి బాలరాజు అన్నారు.
సోమవారం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని దేవరకొండ చేనేత సహకార సంఘం భవన ఆవరణలోని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ చేరుపల్లి బాలరాజు మాట్లాడుతూ.. కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి సమాజానికే కాకుండా బీసీ వర్గాలకు స్ఫూర్తిదాయకమైన నాయకుడని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వదులుకున్న గొప్ప మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు. చేనేత రంగం అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, నేటి చేనేత సహకార సంఘాల ఏర్పాటుకు ఆయన కృషి ఎంతో దోహదపడిందని గుర్తు చేశారు.
పద్మశాలి సమాజానికి బాపూజీగా నిలిచిన కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రను సమాజం ఉన్నంతకాలం మరువబోదని బాలరాజు అన్నారు. ఆయన ఆశయాలను భావితరాలకు అందించడంతో పాటు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పున్న గోవర్ధన్, చేనేత సహకార సంఘం సభ్యులు గుర్రం విజయలక్ష్మి, నిరంజన్, చిటిపోలు శ్రీధర్, పగిడిమర్రి శ్రీనివాస్, రాపోలు భారతమ్మ, మాజీ సర్పంచ్ పున్న వెంకటేశ్వర్లు, చిలువేరు వీరేష్, మాకం మహేష్, గంజి హరి, గంజి సత్యనారాయణ, చిలువేరు శీను, దువ్వ వెంకటేశ్వర్లు, పున్న వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply