అయ్యప్ప నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ఉట్లు కొట్టిన రాధాకృష్ణులు
దేవరకొండ, సెప్టెంబర్ 21 (ప్రతినిధి):
గోకులంలో శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి ఉట్లు కొట్టే సన్నివేశాన్ని తలపించేలా దేవరకొండ పట్టణంలోని అయ్యప్ప నగర్లో చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో ఉట్లు కొట్టి సందడి చేశారు. అయ్యప్ప నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన ఉట్ల సంబరాలు భక్తిశ్రద్ధలతో పాటు ఉత్సాహభరితంగా సాగాయి.
ఉత్సవ నిర్వాహకులు ఉట్టిని పైకి లాగగా, అందంగా రాధాకృష్ణుల వేషధారణలో ముస్తాబైన చిన్నారులు గంతులు వేస్తూ ఉట్టిని కొట్టేందుకు ప్రయత్నించారు. చిన్నారుల సందడి, భక్తి భావంతో కూడిన ఈ వేడుక అక్కడికి వచ్చిన భక్తులు, స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. హోలీ, మహిళా దినోత్సవం, సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు వంటి కార్యక్రమాలతో పాటు గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా అందరూ కలిసి భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
రాధాకృష్ణుల వేషధారణలో చిన్నారులను చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. చిన్నారులు ఉట్లు కొడుతూ సందడి చేస్తున్న దృశ్యాలను తల్లిదండ్రులు, భక్తులు తమ సెల్ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.
అయ్యప్ప నగర్ గణేష్ మండపం వద్దకు ప్రతి సంవత్సరం విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఉట్లు కొట్టిన చిన్నారులకు అనంతరం బహుమతులను అందజేశారు.










Leave a Reply