భూమి, భుక్తి, హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణకు స్ఫూర్తి
హైదరాబాద్, సెప్టెంబర్ 26 (ప్రతినిధి): దొరల పాలనను ధిక్కరించి, వెట్టిచాకిరి, భూస్వామ్య దోపిడికి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెకు ఘనంగా నివాళులర్పించారు.
అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా భూమి, భుక్తి, హక్కుల కోసం ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని సీఎం పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఆమె చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని తెలిపారు.
ఐలమ్మ స్ఫూర్తితో బీసీలు, పేదలు, మహిళలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఐలమ్మతో పాటు సమ్మక్క–సారలమ్మ వంటి వీరనారుల స్ఫూర్తిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్లు గుర్తుచేశారు.
సామాజిక న్యాయం కోసం ఐలమ్మ చేసిన పోరాటానికి గుర్తింపుగా కోఠిలోని మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు పెట్టిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. బీసీ విద్యార్థులకు విద్యావకాశాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లలో సదుపాయాల మెరుగుదలతో పాటు యువత, మహిళల ఆర్థిక సాధికారతకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
ప్రతి వర్గానికి సమాన అవకాశాలు, గౌరవం, న్యాయం అందించడమే చాకలి ఐలమ్మకు అందించే నిజమైన నివాళి అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ఆయుష్ 24 న్యూస్ — The Voice of Truth










Leave a Reply