చిన్నారి చేతిలో చిట్టి వినాయకుడు… ఏం మాట్లాడుకున్నారో వారికే తెలియాలి!
దేవరకొండ, సెప్టెంబర్ 24 (ప్రతినిధి):
నవరాత్రుల పాటు పూజలందుకున్న గణనాథుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్న వేళ… ఓ చిన్నారి తన చేతుల్లో చిట్టి వినాయకుడిని పట్టుకుని ప్రేమగా చూస్తున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది.
దేవరకొండ పట్టణానికి చెందిన గంజి శ్రీనివాసులు–స్వాతి దంపతుల ద్వితీయ కుమార్తె గంజి స్నిగ్ధ, బుధవారం తల్లిదండ్రులతో కలిసి వినాయక నిమజ్జన కార్యక్రమానికి చెరువు వద్దకు చేరుకుంది. నిమజ్జనానికి ముందు చిట్టి గణపయ్యను చేతుల్లోకి తీసుకుని ఎంతో ఆప్యాయంగా చూస్తూ ముచ్చటించిన ఆ క్షణం ప్రత్యేకంగా నిలిచింది.
“ఈ నవరాత్రులన్నీ నీ ముందు ఆడాం… పాడాం… ఎన్నో మధుర జ్ఞాపకాలు మిగిల్చావు. అప్పుడే మమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నావా? మళ్లీ వచ్చే ఏడాది తప్పకుండా వస్తావు కదూ… నీ కోసం ఎదురుచూస్తాను…” అన్నట్లుగా చిన్నారి గణనాథుడిని చూస్తున్న తీరు చూపరులను కట్టిపడేసింది.
అసలు ఆ చిన్నారి తన చిట్టి వినాయకుడితో ఏం మాట్లాడిందో… ఆ చిన్నారికి, ఆ విఘ్నేశ్వరుడికే తెలియాలి!
ఈ అపురూప క్షణాన్ని ఫొటోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో పలువురు స్పందిస్తున్నారు. చిన్నారి ముఖంలో కనిపిస్తున్న ప్రేమ, గణపయ్యను వీడలేకపోతున్నట్లున్న భావోద్వేగం చూసి, “నిజంగా ఆ చిన్నారి మనసులోనూ ఇదే భావన ఉందేమో” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
చిన్నారులకు వినాయక చవితి అంటే ఎనలేని ఆనందం. గణపయ్య రాకతో మొదలయ్యే సందడి, ఆటపాటలు, పూజలు, ప్రసాదాలు… నిమజ్జనంతో ముగిసిపోతున్న వేళ వారిలో కలిగే భావోద్వేగం వర్ణనాతీతం.
“గణనాథా… వెళ్లిరావయ్యా! మళ్లీ వచ్చే ఏడాది నీ కోసం ఎదురుచూస్తూ ఉంటాను…” అన్నట్లుగా చిట్టి వినాయకుడిని చేతుల్లో పట్టుకుని ముచ్చటిస్తున్న గంజి స్నిగ్ధ చిత్రం ఇప్పుడు ఓ మధుర జ్ఞాపకంగా నిలిచింది.
చిన్నారి చేతిలో చిట్టి గణపయ్య…
ఆ ఇద్దరి మధ్య ముచ్చట…
చూసిన ప్రతి మనసునూ తాకుతున్న ఓ అపురూప దృశ్యం!










Leave a Reply