దేవరకొండ, సెప్టెంబర్ 21 (ప్రతినిధి): చిన్నారులకు అక్షర సరస్వతీ దేవి ఆశీస్సులు అందాలని ఆకాంక్షిస్తూ దేవరకొండ పట్టణంలోని మున్సిపల్ చైర్పర్సన్ నివాసం ఎదుట ఏర్పాటు చేసిన వినాయక మండపంలో సోమవారం చిన్నారులచే సరస్వతీదేవి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమంలో చిన్నారులే పూజారులుగా వ్యవహరించి శాస్త్రోక్తంగా పూజా విధానాన్ని నిర్వహించారు. పూలు, అగరబత్తులు, పండ్లు, హారతి కర్పూరం, పుస్తకాలను తీసుకువచ్చి సరస్వతీదేవి వద్ద ఉంచి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు.
చిన్నారులు స్వయంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించడాన్ని చూసిన తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. చిన్నారుల్లో భక్తి, సంప్రదాయాలు, సంస్కృతి పట్ల అవగాహన పెంపొందించేలా కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం మంగళహారతి నిర్వహించి పూజా కార్యక్రమాన్ని ముగించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే పిల్లలకు దైవభక్తి, సంప్రదాయాలు, సంస్కృతి, విద్య యొక్క ప్రాధాన్యతను తల్లిదండ్రులు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు చిన్నారుల్లో ఆధ్యాత్మికతతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలపై ఆసక్తిని పెంచుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు, చిన్నారుల తల్లిదండ్రులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.










Leave a Reply