రంగారెడ్డి, సెప్టెంబర్ 17: చేవెళ్ల డివిజనల్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రూ.లక్ష లంచం తీసుకుంటున్న ఇద్దరు ట్రెజరీ అధికారులు, ఓ ప్రైవేట్ వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ వెల్లడించింది.
ఏసీబీ వివరాల ప్రకారం.. సబ్ ట్రెజరీ ఆఫీసర్ మడిగ లక్ష్మయ్య, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ కవాలి అనురాధ, ప్రైవేట్ వ్యక్తి జంగయ్య ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.
ఫిర్యాదుదారుడి పెండింగ్‌లో ఉన్న సస్పెన్షన్ కాలం జీతాల బిల్లులు, రిటైర్మెంట్ అనంతర పెన్షన్ బకాయిలను ప్రాసెస్ చేసేందుకు రూ.2.50 లక్షల లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ తెలిపింది. ఇందులో భాగంగా ముందుగా రూ.లక్ష చెల్లించేందుకు ఒప్పందం జరిగినట్లు పేర్కొంది.
దీంతో AO-1 తన వాటాగా రూ.50 వేలు, AO-2 సూచనల మేరకు ప్రైవేట్ వ్యక్తి జంగయ్య మరో రూ.50 వేలు స్వీకరించినట్లు ఏసీబీ తెలిపింది. మొత్తం రూ.లక్షను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు ముగ్గురినీ హైదరాబాద్ నాంపల్లిలోని SPE & ACB కేసుల ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఎదుట న్యాయ రిమాండ్ కోసం హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ వెల్లడించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది.
ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే ACB టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని ఏసీబీ ప్రజలను కోరింది.
గమనిక: పై ఆరోపణలు ఏసీబీ వెల్లడించిన వివరాల ఆధారంగా మాత్రమే. కేసు తుది ఫలితం కోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.










Leave a Reply