భీమనపల్లి చెరువులో కొనసాగుతున్న వినాయక విగ్రహాల నిమజ్జనం
ఏర్పాట్లను పర్యవేక్షించిన పోలీస్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు
దేవరకొండ, సెప్టెంబర్ 23 (ప్రతినిధి):
దేవరకొండ పట్టణంలోని 20 వార్డుల్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. ఆయా వార్డుల నుంచి భక్తులు భజనలు, కోలాటాలు, భక్తి గీతాలు, నృత్యాలతో గణనాథుడిని ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు.
పట్టణంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం, సీతారామస్వామి ఆలయం, పెద్ద రామాలయంలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలు తొలుత నిమజ్జనానికి బయలుదేరాయి. నిమజ్జన కార్యక్రమానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ హాజరై ప్రారంభించారు.

వినాయక విగ్రహాల నిమజ్జన సమయంలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా పోలీస్, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భీమనపల్లి చెరువు వద్ద నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేసి, భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.
నిమజ్జన ఏర్పాట్లను దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు, తహసీల్దార్ సంజీవ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రామ దుర్గారెడ్డితో పాటు విద్యుత్ శాఖ అధికారులు పర్యవేక్షించారు.
పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలు వరుసగా భీమనపల్లి చెరువుకు చేరుకుంటుండటంతో నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య కొనసాగుతోంది.










Leave a Reply